- బరిలో పదికిపైగా యూనియన్లు.. 36 వేల మందికి రెండు ఓట్లు
- రీజియన్, రాష్ట్ర స్థాయిలో వేర్వేరుగా పోలింగ్
- వచ్చే నెల 9న పోలింగ్..17న ఫలితాలు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలోని బస్సు స్టేషన్లు, డిపోల్లో కార్మిక సంఘాల ప్రచారం జోరందుకుంది. వచ్చే నెల 9న ఎన్నికలు జరగనుండగా.. పదికిపైగా యూనియన్లు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యాయి. దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండడంతో అన్ని సంఘాలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 వేల మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి కార్మికుడు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది.
రీజియన్ స్థాయికి ఒకటి, రాష్ట్ర స్థాయికి మరో ఓటు వేయనున్నారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో వచ్చే నెల 9న పోలింగ్ నిర్వహించనుండగా.. 17న ఫలితాలు ప్రకటించనున్నారు. ప్రధాన సంఘాల మధ్య పోటీ నెలకొననుంది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎస్‌డబ్ల్యూయూ, ఈయూ, ఆర్టీసీ కార్మిక సంఘ్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్, తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్, తెలంగాణ స్టేట్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ తదితర సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి.
డిపోల వారీగా కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తూ తమ డిమాండ్లు, సమస్యలను వివరిస్తున్నాయి. టీఎంయూలోని అశ్వద్ధామ రెడ్డి యూనియన్‌కు పోటీ చేసే అవకాశం లేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే థామస్ రెడ్డి వర్గం మాత్రం పోటీకి అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యవహారంపై ఈ నెలాఖరులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రాజకీయ పార్టీల ఎంట్రీ..
ఆర్టీసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మద్దతు కూడా చర్చనీయాంశంగా మారింది. ఐఎన్టీయూసీ అనుబంధ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు మద్దతుగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. థామస్ రెడ్డి వర్గానికి పోటీ అవకాశం వస్తే బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ అనుబంధ ఆర్టీసీ కార్మిక సంఘ్‌కు బీజేపీ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు సీపీఎం అనుబంధ సీఐటీయూ, ఈయూకు సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ మద్దతుగా ఉన్నట్లు కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎన్నికల్లో గెలిచే గుర్తింపు సంఘం ఆర్టీసీకి సంబంధించిన పలు కీలక అంశాల్లో కార్మికుల తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. దీంతో ప్రతి యూనియన్ గెలుపును సీరియస్‌గా తీసుకుంది. పాత హక్కుల పునరుద్ధరణ, పెండింగ్ సమస్యల పరిష్కారం, కార్మికుల ప్రయోజనాల కోసం పోరాడతామని సంఘాల నేతలు హామీలు ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు డిపోలను చుట్టేస్తుండటంతో ప్రచారం మరింత వేడెక్కింది.
ఏర్పాట్లలో కార్మిక శాఖ..
ఎన్నికల నిర్వహణకు కార్మిక శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అర్హులైన ఓటర్ల గుర్తింపు, పోటీ చేసే సంఘాలకు గుర్తుల కేటాయింపు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సుల సిద్ధం వంటి పనులు చేపడుతోంది. ఆర్టీసీ యాజమాన్యం కూడా ఎన్నికల నిర్వహణకు సహకరిస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో కార్మికులు ఏ సంఘానికి మద్దతు ఇస్తారన్న దానిపై ఆర్టీసీ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
